తెలుగు వారు ఎక్కడున్నా పండగలను మరిచిపోరు. అది జీవితం. ఆనందం. ఆత్మీయతానురాగాలు పెనవేసుకునే వైభవోపేత సందర్భం. అందుకే తీరాలు దాటినా మన పండగొచ్చిందంటే సంబరం చేసుకోవాల్సిందే. డెన్మార్క్ లో ఉన్న తెలంగాణీయులు దుర్ముఖి నామ సంవత్సరం తెచ్చిన ఉగాది సంబంరాలను వేడుకగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ డెన్మార్క్ ఎన్నారైలతో పాటు అక్కడ నివసిస్తున్న ఇతర భారతీయులు కూడా హాజరు కావడం విశేషం.
ఉగాది వేడుకలను ఘనంగా ప్రారంభించిన అనంతరం పంచాంగ శ్రవణం చేసి షడ్రుచుల ఉగాది పచ్చడిని అందరికీ పంచారు. చిన్నా పెద్ద అందరూ ఆడిపాడి అలరించారు. సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ సంప్రదాయ భోజనాలు ఆరగించి అందరూ నెమరువేసుకున్నారు.
టాడ్ ప్రెసిడెంట్ రాజరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సంబరాలను కార్యవర్గ సభ్యులు కిరణ్మయి, శ్యామ్ ఆకుల, ఉపేందర్, శ్యామ్ చెలిక, కరుణాకర్ రెడ్డి, ఉమ తదితరులు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కొందరు బహుమతులు కూడా గెలుచుకున్నారు.